రివ్యూలు రాయడం ఒక రకమైన ప్రజాసేవ: రామ్ గోపాల్ వర్మ
- రివ్యూవర్లు సినీ పరిశ్రమ కోసం పని చేసేవాళ్లు కాదన్న వర్మ
- వారు పూర్తిగా ప్రేక్షకులకు చెందినవారని వ్యాఖ్య
- సామాన్య ప్రేక్షకుల జేబుకు రక్షణ కవచంలా నిలుస్తున్నారని కితాబు
ఇటీవలి కాలంలో చిత్ర పరిశ్రమ గురించి జరుగుతున్న అతిపెద్ద చర్చ.. 'సినిమా రివ్యూలు'. రివ్యూవర్ల వల్లే థియేటర్లకు జనాలు రావడం లేదని, నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేసి సినిమాలను దెబ్బతీస్తున్నారని చాలా మంది స్టార్ నటులు, నిర్మాతలు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో థియేటర్ల టికెట్ ధరలు, ఓటీటీల ప్రభావం వల్లనే ప్రేక్షకులు రావడం లేదని వాదిస్తున్నారు. ఈ హాట్ టాపిక్‌పై తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రివ్యూవర్లు సినిమా పరిశ్రమ కోసం పని చేసేవాళ్లు కాదని, వారు పూర్తిగా ప్రేక్షకులకు చెందినవారని ఆర్జీవీ స్పష్టం చేశారు. "ఒక సినిమా చెత్తగా ఉన్నప్పుడు.. ప్రేక్షకులు తమ కష్టార్జితాన్ని, అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకోవద్దని ఒక విమర్శకుడు హెచ్చరిస్తే, అది ఒక రకమైన ప్రజాసేవ లేదా దాతృత్వంతో సమానమౌతుంది" అని వర్మ అభిప్రాయపడ్డారు.
ఈ రోజుల్లో సినిమా టికెట్ల ధరలు, థియేటర్లలో స్నాక్స్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని ఆర్జీవీ గుర్తుచేశారు. ఒక సామాన్య కుటుంబం థియేటర్‌కు వెళ్లాలంటే భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని.. ఇలాంటి పరిస్థితుల్లో రివ్యూవర్లు సామాన్య ప్రేక్షకుడి జేబుకు ఒక రక్షణ కవచంలా నిలుస్తున్నారని కొనియాడారు. సినిమా నచ్చకపోతే రివ్యూల వల్ల ఫ్లాప్ అయిందని నిర్మాతలు ఏడవడం మానేసి, కంటెంట్‌ను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చూసుకోవాలనే అర్థం వచ్చేలా వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్లో వైరల్‌గా మారాయి.